Wish you happy birthday Mr Rakesh, our donor            

దోపిడి, హింసల నుండి బాలలను రక్షిద్దాం

దోపిడి, హింసల నుండి బాలలను రక్షిద్దాం, బాలల హక్కుల రక్షణకై వ్యవస్థల్ని పటిష్ట పరుద్దాం

అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక అమలులో 25 సంవత్సరాలు

నాట్లేస్తూ,కలుపు తీస్తూ,రాళ్ళు కొడుతూ,గొర్రెలు బర్రెలు మేపుతూ, అంట్లు తోముతూ,చెత్త కాగితాలేరుతూ, బిచ్చమెత్తుకుంటూ  ఎక్కడ చూసినా ఈ పనుల్లో పిల్లల్ని చూస్తూనే ఉన్నాం. పసితనంలో ఆడపిల్ల మెళ్ళో తాళి ముడి పడటం చాలానే చూసాం, మన ముందే గచ్చకాయలు ఆడుకుంటున్న పిల్ల హట్టత్తుగా మాయమైతే ,తర్వాతెప్పుడో పేపర్లో చదువుతాం, అమ్మకానికి తరలించుకు పోయారని,. డొక్కలు ఎందుకు పోయిన పిల్లల్ని,పోషణ లేక, చదువుకు దూరమై,ఆటలు కలల్లోనే మిగిలి పోయిన బాల్యాన్ని రోజు చూస్తూనే ఉన్నాం. మనందరి ముందు ద్వంసమవుతున్న బాల్యాన్ని కాపాడుకోక పొతే “పిల్లల్ని ప్రేమిస్తామన్నది ”హాస్యాస్పద మైన ప్రకటనగా అయిపోయిందని తెలుసుకున్నాం. అందుకే ఇంకే మాత్రం అలక్ష్యం పనికిరాదని పిల్లల్ని రక్షించుకోవడానికి ముందుకొచ్చాం.

గత ఇరవై ఏళ్లుగా పిల్లల్ని,బాల్యాన్ని వాళ్ళ హక్కుల్ని  రక్షించుకోవడానికి మనం చేస్తున్న శ్రమ వృధా కాలేదు.బర్రెల వెనుక తిరిగిన బాల్యాన్ని బడుల్లో చూస్తున్నాం ,పెళ్లి పందిళ్ళ లో బందీ కాబోతున్న ఆడపిల్ల్లల్ని కాపాడుకుని కాలేజి చదువుల వరకు నడిపించాం.

అయినా బాలల హక్కుల సంరక్షణలో అనేక సవాళ్లు ఇంకా పిల్లలను పట్టి పీడిస్తూనే వున్నాయి. పిల్లల హక్కుల పరిరక్షణ 8గంటల ఆఫీసు పని కాదు.పిల్లల్ని పనుల నుండి విడిపించడానికి,విడిపించిన పిల్లల్ని బడుల్లో చదివించడానికి,ఇల్లోదిలిన పిల్లల్ని తిరిగి తెచ్చుకోవడానికి, పందిట్లో  కూర్చున్న పదేళ్ళ పిల్లను బడి వేపు నడిపించడానికి,కాల పట్టిక లో కూర్చుని సాధించలేమని తెలుసు. హక్కుల ఉల్లంఘన గుర్తించడమే గొప్పపని పరిరక్షణకూ కొత్త ఉపాయాలు,కొత్త వ్యూహాలు ఆలోచించక పోతే పిల్లలు ఫిడనలో నిస్సహాయులై మొత్తుకో వలసి వస్తుంది,

రాజ్యంగ రక్షణలున్నాయి,పిల్లల రక్షణలో చట్టాలున్నాయి,అమలు చేయాల్సిన ప్రభుత్వం ఉంది. మనం పూనుకోక పొతే పది మంది కలవక పొతే చట్ట బద్దంగా పిల్లల పరిరక్షణ,వారి కందాల్సిన  సదుపాయాలు  అందవు. ప్రభుత్వంతో పని చేయించడంలోనే బాలల హక్కుల పరిరక్షణ కు ఉద్యమిస్తున్న క్రియశీల కార్యకర్తల సృజనాత్మకతకు సవాలని గుర్తించుకోవాలి.

ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడిక (CRC)ను 1992  లోనే భారత ప్రభుత్వం అంగీకరించి,దేశంలో అమలుకు  స్వీకరించింది.

అయితే పిల్లల  హక్కుల పరిరక్షణ మనలాంటి క్రియాశీల కార్యకర్తల, సంస్థల అప్రమత్తత పైన ఆధారపడి వుంది .ఉల్లంఘనలకు సకాలంలో స్పందించి కమ్యునిటి,ప్రభుత్వాన్ని పిల్లల రక్షణలోదింపే పనిలోకి దిగాల్సిందే. దీర్ఘకాలిక ప్రణాళికలతో ఓపికతో, ప్రజా సమీకరణ చేపట్టాల్సిందే .

పిల్లలపై దోపిడీ,వివక్ష,హింస వేయి రూపాల్లో ఉంటుంది.వెతికి పట్టుకోవడానికి,బాలల పరిరక్షణలో నిండా మునిగి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లల హక్కుల పరిరక్షణ లోని సాంకేతికాంశాలు ,అందుబాటులోని  సేవలు, చట్ట బద్దత , ప్రభుత్వ బాధ్యతలపై కమ్యునీటికి  అవగాహన పూర్తిగా ఉండదు.దానకి మనమే వారధి.

పిల్లల హక్కుల ఉల్లంఘనల పట్ల కమ్యునిటి సామర్ద్యాలను పెంచి వీలైనంత మందిని భాగస్వాములను చేయడం, ప్రభుత్వ వ్యవస్థ ను సక్రియం చేయడం మన ముందున్న కర్తవ్యాలు. వీటి కోసం నిత్యం శోధనలో ,పిల్ల హక్కుల సాధనలో మునిగి పోదాం